లారీ ఢీకొని మహిళ దుర్మరణం
రొంపిచర్ల, ఆంధ్రప్రభ: సుబాబుల్ లారీ ఢీ కొని మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో అన్నవరం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రమైన రొంపిచర్లకు చెందిన వెంగళరాజు సైదమ్మ (55) తన భర్త సుబ్బరాజుతో కలిసి నరసరావుపేట నుండి బైక్ మీద స్వగ్రామానికి బయలు దేరారు. మార్గమధ్యలో అన్నవరం గ్రామం దాటిన తర్వాత రొంపిచర్ల వైపుకు వేగంగా వెళుతున్న సుబాబుల్ లారీ వీరు వెళ్ళుతున్న బైక్ ను బలంగా ఢీకొనడంతో వెనుక వైపు ఉన్న సైదమ్మ లారీ టైర్ల క్రింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. మృతురాలి భర్త సుబ్బారాజుకు స్వల్ప గాయాలయ్యాయి.
సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారు అయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా మృతురాలు సీపీఎం నాయకురాలు, అలాగే గతంలో ఐద్వాలో పనిచేసినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు.
