రైతాంగానికి అండగా నిలుస్తాం..
- మంత్రి పయ్యావుల కేశవ్
- సూపర్ ఎల్‌నినో ప్రభావంపై క్షేత్రస్థాయి పరిశీలన..
- సమగ్ర నివేదిక కోరిన ప్రభుత్వం
అనంతపురం, ఆంధ్రప్రభ: వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంటలపై దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందాలు జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నాయి.
అనంతపురం రామ్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పాలడుగు సత్యనారాయణ నేతృత్వంలోని వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతపురం జిల్లాలో పర్యటించిన శాస్త్రవేత్తలు జిల్లాలోని వాతావరణ పరిస్థితులు, పంటల స్థితిగతులను మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వ్యవసాయ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తల బృందాలు పర్యటిస్తున్నాయని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పరిస్థితులను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిస్తున్నట్లు చెప్పారు.
రైతు సేవా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహిస్తూ, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షాభావం నెలకొంది, దాని ప్రభావం ఏయే పంటలపై పడుతోంది అనే అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో రైతులకు నష్టం తగ్గించేలా ప్రత్యామ్నాయ పంటలు, ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సమగ్ర నివేదికను కోరినట్లు తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంపై నివేదిక అందిన వెంటనే రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. రైతాంగానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తుందని భరోసా ఇచ్చారు.
