ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్ నిషేధం
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ: ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనున్నట్లు లక్ష్మణచాంద పంచాయతీ కార్యదర్శి అయిటి సుధాకర్ తెలిపారు. పర్యావరణానికి, మానవ మనుగడకు ముప్పుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంలో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి దుకాణదారుడికి మంగళవారం నోటీసులు అందజేశారు.
ఒక్కసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, స్పూన్లు తదితర వస్తువులను వినియోగించకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి నసిరుద్దీన్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
