నేరాలపై ఉక్కుపాదం..

ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యం

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు.. బాధితులకు సత్వర న్యాయం

గద్వాల, ఆంధ్రప్రభ: జిల్లాలో నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. నేరస్తులకు చట్టపరంగా శిక్ష పడేలా, బాధితులకు సత్వర న్యాయం అందేలా పనిచేయాలని సూచించారు.

మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలను ఎస్పీ సమీక్షించారు. సీసీటీఎన్‌ఎస్‌ 2.0ను సమర్థవంతంగా వినియోగించాలని, ప్రతి కేసును సకాలంలో నమోదు చేసి దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక సాధనాలను పూర్తిస్థాయిలో వినియోగించి పోలీసింగ్‌లో పారదర్శకత, వేగం, సేవల నాణ్యతను పెంచాలని ఆదేశించారు.

సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అక్రమ ఇసుక, గంజాయి రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.

అత్యవసర సేవలపై అవగాహన కల్పించాలి

డయల్‌ 100 స్థానంలో అందుబాటులోకి వచ్చిన డయల్‌ 112 అత్యవసర సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అత్యవసర సమయంలో పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక సేవలను వేగంగా పొందేందుకు డయల్‌ 112ను వినియోగించుకునేలా ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించాలి

ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించి, అవి నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని ఎస్పీ ఆదేశించారు. సీసీ కెమెరాల వినియోగంతో ఆస్తి నేరాలను నియంత్రించడంతో పాటు నేరాలను ఛేదించడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు.

గ్రామస్థాయి పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గ్రామ పోలీసు అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని, సామాజిక సమస్యలను గుర్తించడంతో పాటు ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. శంకర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.