రైలులో 63 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కామారెడ్డి ఎక్సైజ్‌ స్టేషన్‌ సిబ్బంది, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, రైల్వే పోలీసుల సహకారంతో నిర్వహించిన తనిఖీల్లో 63 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీధర్‌, కామారెడ్డి జిల్లా నిషేధ, ఎక్సైజ్‌ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు.

సంబల్‌పూర్‌ నుంచి నాందేడ్‌ వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో విశ్వసనీయ సమాచారం మేరకు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైలులో 63 కిలోల ఎండు గంజాయి లభించినట్లు ఎక్సైజ్‌ సీఐ సంపత్‌కృష్ణ తెలిపారు.

గంజాయిని తరలిస్తున్న నిందితులు ఎవరూ పట్టుబడలేదని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.

ఈ తనిఖీల్లో కామారెడ్డి ఎక్సైజ్‌ సీఐ సంపత్‌కృష్ణ, డీటీఎఫ్‌ ఏసీఐ సుందర్‌సింగ్‌, ఎస్సైలు విక్రమ్‌కుమార్‌, శ్రీనివాసరావు, శరత్‌కుమార్‌, శిక్షణలో ఉన్న ఎస్సైలు అనిల్‌, మధు, సిబ్బంది జాన్‌, ఫరీద్‌, అమృత్‌రెడ్డి, శంకర్‌, పవన్‌, నర్సింలు, శరత్‌, దినేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.