నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

భీమ్‌గల్‌ మున్సిపాలిటీలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌ మున్సిపాలిటీ పరిధిలో నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైనట్లు మున్సిపల్‌ కమిషనర్‌ డి. గజానంద్‌ తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్‌ అందించేందుకు మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్‌ బాధితులు, పైలేరియా బాధితులు తదితర అర్హత కలిగిన వారు నూతన పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్‌ తెలిపారు. అర్హులు అవసరమైన ధ్రువపత్రాలతో మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలకు సంబంధించిన వివరాలను సంబంధిత సిబ్బంది నుంచి తెలుసుకోవచ్చన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పెన్షన్‌ అందేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ గజానంద్‌ స్పష్టం చేశారు.

అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నూతన పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్‌ అధికారులు కోరారు.