హోస్ట్‌గా హిట్‌మ్యాన్.. !!
- రోహిత్ శర్మ నయా ఇన్నింగ్స్
- సెప్టెంబర్‌లో రోహిత్ కొత్త షో ప్రారంభం
- ఆ వైరల్ డైలాగ్‌తో తొలి టీజర్ విడుదల
ఆంధ్రప్రభ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరో కొత్త అవతారంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మైదానంలో తన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్న హిట్‌మ్యాన్.. ఇప్పుడు టెలివిజన్ తెరపై హోస్ట్ గా కనిపించనున్నారు. ప్రముఖ వినోద వేదికలైన సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, సోనీలివ్‌లో ప్రసారం కానున్న ప్రత్యేక కార్యక్రమానికి రోహిత్ శర్మ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. క్రికెట్‌కు సంబంధించిన కార్యక్రమాలకు భిన్నంగా వినోదం, సరదా సంభాషణలు, రోహిత్ సహజమైన హాస్యంతో ఈ షో రూపొందిస్తున్నట్లు సమాచారం.
వైరల్ డైలాగ్‌తో టీజర్ సందడి…
రోహిత్ కొత్త కార్యక్రమానికి సంబంధించిన టీజర్‌ను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా విడుదల చేసింది. ఇందులో అభిమానులతో సరదాగా ముచ్చటిస్తున్న రోహిత్ కనిపించారు. మైదానంలో రోహిత్ నోటి నుంచి వచ్చిన “కోయీ భీ గార్డెన్ మే నహీ ఘూమేగా” అనే వైరల్ డైలాగ్‌ను అభిమానులు మరోసారి చెప్పాలని కోరగా.. దానిపై రోహిత్ తనదైన శైలిలో స్పందించారు. అదే డైలాగ్‌ను పదేపదే చెప్పమని అడగడంతో సరదాగా అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయే సన్నివేశాలను టీజర్లో చూపించారు. ఈ టీజర్ ద్వారా రోహిత్లోని సరదా, హాస్యభరితమైన కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
సెప్టెంబర్‌లో ప్రారంభం..
సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గౌరవ్ బెనర్జీ ఈ కార్యక్రమంపై వివరాలు వెల్లడించారు. రోహిత్ శర్మ తొలిసారిగా తన సొంత షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారని తెలిపారు. సెప్టెంబర్‌లో సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, సోనీలివ్‌లో కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అయితే షో పేరు, కార్యక్రమ రూపకల్పన, పాల్గొనే అతిథులు, ఇతర వివరాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
సోనీ కొత్త షోలలో ప్రత్యేక ఆకర్షణ…
సోనీ రూపొందిస్తున్న కొత్త వినోద కార్యక్రమాల్లో రోహిత్ శర్మ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా కౌన్ బనేగా క్రోర్‌పతి-18, అజయ్ దేవగన్ హోస్ట్‌గా క్రైమ్ పెట్రోల్-2026, భారతి సింగ్, హర్ష్ లింబాచియా వ్యాఖ్యాతలుగా ఇండియన్ గేమ్ షో వంటి కార్యక్రమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. క్రికెట్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శర్మ.. ఇప్పుడు టీవీ హోస్ట్‌గా ఎలాంటి ముద్ర వేస్తారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
