ఫోన్ పోయిందా..? వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి

సీఈఐఆర్‌ పోర్టల్‌తో పోయిన ఫోన్లను గుర్తిస్తున్న పోలీసులు
ఎనిమిది మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగింత

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ: మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నా, దొంగిలించబడినా బాధితులు ఆలస్యం చేయకుండా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని భీమ్‌గల్‌ ఎస్‌ఐ సీహెచ్‌ తిరుపతి సూచించారు. ఫోన్‌ పోయిన వెంటనే దాని ఐఎంఈఐ నంబర్‌తో పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా మొబైల్‌ను గుర్తించి తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

మంగళవారం వివిధ కారణాలతో పోగొట్టుకున్న ఎనిమిది మొబైల్‌ ఫోన్లను సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా గుర్తించి రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. మొబైల్‌ ఫోన్‌ పోయినప్పుడు ప్రజలు ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

సీఈఐఆర్‌ పోర్టల్‌లో మొబైల్‌ వివరాలు, ముఖ్యంగా ఐఎంఈఐ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్‌ను బ్లాక్‌ చేయడంతో పాటు, దాన్ని ఇతర సిమ్‌తో వినియోగించినప్పుడు గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫోన్‌ తిరిగి లభించిన తర్వాత దాన్ని అన్‌బ్లాక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉందన్నారు.

ప్రజలు తమ మొబైల్‌ ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌ను తప్పనిసరిగా భద్రపరచుకోవాలని, ఫోన్‌ కొనుగోలు చేసినప్పుడు లభించే బిల్లు, పెట్టె తదితర వివరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల వద్ద మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

పోయిన మొబైల్‌ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించడంలో కీలకంగా పనిచేస్తున్న సైబర్‌ బృందం సభ్యులను ఎస్‌ఐ తిరుపతి అభినందించారు. పోలీసులు చొరవ తీసుకుని తమ ఫోన్లను తిరిగి అందజేయడంపై బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

ఫోన్‌ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మొబైల్‌ను తిరిగి పొందే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని పోలీసులు సూచించారు.

ఈ కార్యక్రమంలో సైబర్‌ క్రైమ్‌ కానిస్టేబుల్‌ తెడ్డు నారాయణ, కానిస్టేబుల్‌ శేఖర్‌, హోంగార్డు కైరి తిరుపతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.