టీబీ రహిత భారత్‌ లక్ష్యంగా వెల్లంపల్లిలో అవగాహన కార్యక్రమం

152 మందికి ఉచిత వైద్య పరీక్షలు..

54 మందికి ఎక్స్‌రేలు..

24 మంది నుంచి తెమడ సేకరణ

టేకుమట్ల, ఆంధ్రప్రభ: టీబీ రహిత భారత్‌ నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన 100 రోజుల ప్రత్యేక టీబీ అవగాహన కార్యక్రమంలో భాగంగా వెల్లంపల్లి గ్రామంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ ఆశాజ్యోతి ఆదేశాల మేరకు, గ్రామ సర్పంచ్‌ కూర వెంకటరాజు రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామంలో 152 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. టీబీ అనుమానిత కేసుల్లో 24 మంది నుంచి తెమడ నమూనాలు సేకరించారు. దగ్గు, తెమడ, జ్వరం వంటి లక్షణాలు ఉన్న 54 మంది అనుమానితులకు ఉచితంగా ఎక్స్‌రేలు తీశారు. పరీక్షల్లో టీబీ నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా మందులు అందజేస్తామని వైద్య సిబ్బంది తెలిపారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. టీబీని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ ఆశాజ్యోతి, మండల ప్రత్యేక అధికారి విజయ్‌, ఎంపీడీవో ఏ. వసంతరామ్‌, వెల్లంపల్లి సర్పంచ్‌ కూర వెంకటరాజు రెడ్డి, ఉప సర్పంచ్‌ గీస రాజనర్సు, గ్రామ కార్యదర్శి గడ్డం నాగరాజు, ఆరోగ్య పర్యవేక్షకురాలు విజయ, ఆరోగ్య సహాయకుడు కె.వి. కృష్ణారెడ్డి, ఎక్స్‌రే టెక్నీషియన్‌ సుధాకర్‌, టీబీ పర్యవేక్షకుడు రవీంద్ర నాయక్‌, ఏఎన్‌ఎంలు స్వరూప, శిరీష, సునీత, ఆశా కార్యకర్తలు ఎం. రాజేశ్వరి, బి. పద్మ, తిరుమల తదితరులు పాల్గొన్నారు.