బాపట్లలో ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు ప్రారంభం
వాహన సౌకర్యాలను పరిశీలించిన వేగేశ్న నరేంద్ర వర్మ
బాపట్ల, ఆంధ్రప్రభ: తల్లులు, వారి నవజాత శిశువులకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించే లక్ష్యంతో బాపట్ల ఏరియా వైద్యశాల ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ (102) వాహనాలను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, బాపట్ల ఎమ్మల్యే నరేంద్ర వర్మ పాల్గొని వాహనాలను ప్రారంభించారు.
అనంతరం వాహనంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. వాహనం పనితీరు, తల్లులు, చిన్నారులకు అందించే సేవలపై సంబంధిత సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రసవం అనంతరం తల్లులు, శిశువులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు ఈ రవాణా సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం తల్లులు, చిన్నారుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

