వయోపరిమితిని పెంచాలని పోలీస్ ఉద్యోగార్థుల డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ డిమాండ్ల సాధన కోసం వినూత్న నిరసన చేపట్టారు. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో బోనాలు ఎత్తుకుని వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. పోలీస్ నియామకాల్లో వయోపరిమితిని పెంచాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేశారు. వయోపరిమితి కారణంగా పలువురు అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాలతో రోడ్డుపైకి వచ్చిన అభ్యర్థులు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో నిరుద్యోగులకు న్యాయం చేయాలని, వయోపరిమితి పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని పోలీస్ ఉద్యోగార్థులు స్పష్టం చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
