అధిక ధరలకు అడ్డుకట్ట వేయాలి

నల్లబెల్లి, ఆంధ్రప్రభ: రైతు, కార్మిక, నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు నల్లబెల్లి మండల తహసీల్దార్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెమోరాండం సమర్పించారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల మండల కమిటీల ఆధ్వర్యంలో నల్లబెల్లిలో నిర్వహించిన ధర్నా అనంతరం ఈ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు చింతకింది కుమారస్వామి, సీపీఎం నాయకుడు కడియాల మనోహర్‌ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించి ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు, కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులోకి తీసుకురావాలని, కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతాంగాన్ని ఆదుకోవాలని నాయకులు కోరారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వంద శాతం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న కార్మిక హక్కులను దెబ్బతీసే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు. దేశంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం మండల నాయకులు బొడిగె సమ్మయ్య, మామిళ్ల పెద్ద ఐలయ్య, కడియాల క్రాంతికుమార్‌, ఇస్లావత్‌ రవి, ఆవాల సంపత్రావు, గట్టి పాపయ్య, మర్రి రమేష్‌, బొడిగె నారాయణస్వామి, దిండు బాబు, కనకం సాగర్‌, కత్తి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.