ఇంద్రకీలాద్రిపై వరుణ యాగం..

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని..
14 నుంచి 16 వరకు త్రయాహ్నిక వైదిక కార్యక్రమాలు
దుర్గాఘాట్, పాత యాగశాల వేదికలుగా విశేష హోమాలు, వరుణ జపాలు
16న కృష్ణాజలాలతో ఘటాభిషేకం..
మహా పూర్ణాహుతితో ముగింపు


(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) :
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా వరుణ యాగములు, వరుణ జపములు, ఘటాభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో శీనా నాయక్‌ తెలిపారు.

కార్యక్రమాలు ఇలా..

మొదటి రోజు 14న ఉదయం 6.15 నుంచి 8.30 గంటల వరకు దుర్గాఘాట్‌లో విఘ్నేశ్వర పూజ, వరుణ అనువాక సహిత కారక పారాయణాలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి పాత యాగశాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, మండపారాధనతో పాటు వరుణ, ఋష్యశృంగ, నవగ్రహ, అష్టదిక్పాలకులకు పురుషసూక్త విధానపూర్వక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు గణపతి, ఇంద్ర, వరుణ, ఋష్యశృంగ, మండప దేవతా ఆవాహనలు, మండప పూజలు జరుగుతాయి. రెండో రోజు 15న ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు దుర్గాఘాట్‌లో వరుణ అనువాక కార్యక్రమం, మండప పూజ నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పాత యాగశాలలో రుద్రహోమం, సాయంత్రం వివిధ హోమాలు, మండప దేవతా హోమాలు, విశేష పూజలు నిర్వహించనున్నారు. మూడో రోజు 16న ఉదయం 6.30 గంటలకు దుర్గాఘాట్‌ నుంచి పవిత్ర కృష్ణానది జలాలను గ్రహిస్తారు. ఉదయం 7 గంటలకు శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో మహాన్యాస పారాయణం, 7.30 గంటలకు ఘటాభిషేకం ప్రారంభమవుతుంది. ఇందులో శత అనువాహక, కారక పారాయణాలు, మండప దేవతా హోమాలు, జయాదులు నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకు పాత యాగశాల వద్ద మహా పూర్ణాహుతితో మూడు రోజుల వైదిక కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సకాల వర్షాలు, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈవో శీనా నాయక్‌ తెలిపారు.