రైతుమేళాలో ప్రత్యేక ఆకర్షణగా ఎస్ఆర్ విద్యార్థుల స్టాల్స్
హసన్‌పర్తి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి రైతుమేళా–2026లో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ సమీపంలోని ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులు ప్రదర్శించిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కార్యక్రమానికి తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయ్ స్టాల్స్‌ను సందర్శించారు. ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు తడి, మెట్ట, ఉద్యాన భూములకు అనుగుణంగా సమగ్ర వ్యవసాయ విధానాల ప్రత్యక్ష నమూనాలను ప్రదర్శించారు. వర్మీకంపోస్ట్, సహజ వ్యవసాయ ఉత్పత్తుల గురించి రైతులకు వివరించారు.
నేల తేమ సంరక్షణ, పాలీ మల్చింగ్, ఫార్మ్ పాండ్, వ్యవసాయ మార్కెటింగ్ క్యూఆర్ కోడ్లు, సమగ్ర కలుపు యాజమాన్యం, ప్రయోజనకర–హానికర కీటకాల నమూనాలను స్టాల్లో ప్రదర్శించారు. రైతుల సందేహాలను విద్యార్థులు నివృత్తి చేసి, తక్కువ ఖర్చుతో సుస్థిర వ్యవసాయం, ప్రకృతి వనరుల సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల డీన్ జి. భూపాల్ రాజ్ నాయకత్వంలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. భార్గవి ఆధ్వర్యంలో, హసన్‌పర్తి మండల వ్యవసాయ అధికారి అనురాధ సహకారంతో విద్యార్థులు స్టాల్‌ను నిర్వహించారు. బి. సాయి కీర్తి, ఎం. ధన్య, టి. ఆకాంక్ష, జె. అక్షిత, ఎ. ప్రణిత, బి. అర్పిత, వి. మేఘన, సనా, టి. హన్సిక, ఎన్. సాయి సింధు, ఎం. స్పందన, జి. కుసుమశ్రీ తదితరులు పాల్గొన్నారు.
