రైతు బిడ్డల ఉన్నత చదువులకు అండగా కేటీఆర్
ల్యాప్‌టాప్‌లు అందజేత
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించిన జీవన్‌కు..
సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న ఫర్జానాకు ల్యాప్‌టాప్‌లు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా మరో ఇద్దరు విద్యార్థులకు చేయూత అందించారు. మిర్యాలగూడ పెద్దతండాకు చెందిన రైతు కుమారుడు జీవన్, వర్ధన్నపేట దమ్మన్నపేటకు చెందిన రైతు కుమార్తె ఫర్జానాలకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు.
జీవన్ ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బయోటెక్నాలజీ సీటు సాధించగా.. ఫర్జానా ప్రస్తుతం సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. గ్రామీణ, రైతు కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు విద్యార్థుల ప్రతిభను గుర్తించిన కేటీఆర్.. వారి చదువుకు అవసరమైన సాంకేతిక సహాయంగా ల్యాప్‌టాప్‌లను అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన కేటీఆర్.. వారు పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తమ ప్రతిభతో కుటుంబాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కాగా, కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు విద్యా సహాయం అందించడం కొనసాగిస్తున్నారు. గతంలోనూ ఈ కార్యక్రమం కింద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అందించారు. 2026 జూన్‌లో సిరిసిల్లలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు ట్యాబ్లెట్లు అందజేశారు.
