రహదారిపై ప్రమాదకర గుంత..
- వాహనదారులకు తప్పని ఇబ్బందులు
గంపలగూడెం, ఆంధ్రప్రభ : మండలంలోని పెనుగొలను–తునికిపాడు ఆర్‌అండ్‌బీ రహదారిపై ఏర్పడిన లోతైన గుంత వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రహదారి మధ్యలోనే గుంత ఏర్పడటంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వేగంగా వచ్చే వాహనదారులు గుంతను గుర్తించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాన్ని ముందుగానే గుర్తించేలా స్థానికులు గుంత వద్ద ఓ కర్రకు ఎర్రటి గుడ్డ కట్టి హెచ్చరికగా ఏర్పాటు చేశారు. గ్రామాలను కలుపుతున్న ఈ ప్రధాన రహదారిపై నిత్యం పాఠశాల విద్యార్థులు, రైతులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో చోదకులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు.
గుంత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
