అమరావతికే ఆయువుపట్టు.. సీడ్ యాక్సెస్ రోడ్డుతో కొత్త దిశ

రాజధాని పునర్నిర్మాణంలో కీలక అడుగు

సీడ్ యాక్సెస్ రోడ్‌తో అమరావతికి కొత్త రూపం

8 లేన్ల రహదారితో మెరుగైన కనెక్టివిటీ

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆధునిక నివాస సముదాయాలు

భవిష్యత్ అభివృద్ధికి మౌలిక వసతుల బాటలు

అమరావతి అభివృద్ధిలో చారిత్రక ఘట్టం

అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: రాజధాని అమరావతి అంటే రెండేళ్ల క్రితం వరకు అవమానాలు.. అవహేళనలు.. అణచివేతలు.. చేదు అనుభవాలు సాక్షాత్కరించేవి. అశాస్త్రీయమైన విభజనతో రాజధానిని కోల్పోయిన రాష్ట్రం చుక్కాని లేని నావగా మారింది.

అదే సమయంలో ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో స్పందించిన రైతులు స్వచ్ఛందంగా 33 వేల 500 ఎకరాల భూమిని అందించారు.

దీంతో అమరావతి ఇక అన్పబుల్.

రాజధానిలో కీలక భవనాలకు పునాదులు ఏర్పడ్డాయి. 2014-19 మధ్య కాలంలో మహానగర నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం కావటంతోపాటు సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది.

రాజధాని ప్రతిపాదిత ప్రాంతం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 25 గ్రామాలను కలుపుతూ 217.2 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రపంచ స్థాయి నగరానికి అర్పణ జరిగింది.

అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మణిహారంగా నిలవాల్సిన అమరావతిలో నీలినీడలు అలముకున్నాయి.


సీడ్ యాక్సెస్ రోడ్.. రాజధానికి మణిహారం

అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ (ఈ3 రోడ్) రాజధానికి మణిహారంగా మారనుంది.

అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) ఈ రహదారి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా పూర్తిచేస్తోంది.

రహదార్లకు ఇరువైపులా దేశ, విదేశీ వృక్ష సంపద గ్రీన్, బ్లూ కాన్సెప్ట్‌ను ప్రస్ఫుటం చేస్తోంది.

రాజధాని నగరంలోని ఎన్-1 నుంచి ఎన్-17 వరకు ఉన్న అన్ని ప్రధాన రోడ్లను అనుసంధానించే ప్రధాన మార్గంగా రూపుదిద్దుకుంది.

సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం పొడవు 21.77 కిలోమీటర్ల మేర నిర్మితమైంది.

దొండపాడు గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా సాగి మణిపాల్ ఆసుపత్రుల వద్ద ఎన్‌హెచ్-16తో కలుస్తుంది.

మొత్తం రహదారికి 60 మీటర్ల రైట్ ఆఫ్ వే (ఆర్‌డబ్ల్యూ) ఉండేలా డిజైన్లు రూపొందించారు.

సీడ్ యాక్సెస్ రోడ్డు మూడు దశల్లో పూర్తికానుంది.

ఈ3 ఫేజ్-1: 14.35 కిలోమీటర్లు
ఈ3 ఫేజ్-2: 3.92 కిలోమీటర్లు
ఈ3 ఫేజ్-3: 3.50 కిలోమీటర్లు

హైస్పీడ్ మల్టీలైన్ హైవే కారిడార్‌గా ఈ రహదారి రూపుదిద్దుకుంటోంది.


8 లేన్ల రహదారిగా అభివృద్ధి

అమరావతిని కాదని మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తేవటంతో రైతులు అలుపెరుగని పోరాటాలు చేశారు.

అంతకు ముందు నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకోవటంతో పాటు అమరావతి చుట్టూ నీలినీడలు అలముకున్నాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వెల్లువెత్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పునర్నిర్మాణానికి పునరంకితమయ్యారు.

దీంతో అమరావతిపై ఆశలు చిగురించాయి.

ఇప్పుడు అమరావతిలో కీలక ఘట్టం చోటుచేసుకుంటోంది.

గత రెండేళ్లలోనే నిర్మాణాలు శరవేగంతో సాగుతున్నాయి.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలతో పాటు రాజధాని ముఖద్వారంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డుతో స్టీల్ బ్రిడ్జి అనుసంధానం పనులు పూర్తయ్యాయి.

ఈనెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించనున్నారు.

అమరావతిలో ఇది ఓ చారిత్రక ఘట్టంగా నిలవనుంది.


భవిష్యత్ అభివృద్ధికి కీలక మౌలిక వసతులు

ఈ3 ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3లో 8 లేన్ల క్యారేజ్‌వే ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కో లేన్ వెడల్పు 11 మీటర్లుగా ఉండేలా నిర్మాణం చేపట్టారు.

మధ్యలో బీఆర్‌ఎస్ కారిడార్, ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

వర్షపు నీటి డ్రైన్లు, నీటి సరఫరా ప్రధాన పైప్‌లైన్, రీయూజ్, ఐసీటీ, గ్యాస్, విద్యుత్, సీవర్ లైన్లు వంటి వివిధ యుటిలిటీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

సైకిల్ ట్రాక్, ఫుట్‌పాత్లు, గ్రీన్ బెల్ట్లు కూడా రహదారిలో భాగం కానున్నాయి.


ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆధునిక నివాస సముదాయాలు

రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న హౌసింగ్ ప్రాజెక్ట్ తుది మెరుగులు దిద్దుకుంటోంది.

నేలపాడులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 9 టవర్లు అందుబాటులోకి రానున్నాయి.

ప్రాజెక్టులో 15 మంది సామర్థ్యం కలిగిన ప్యాసింజర్ లిఫ్ట్‌తో పాటు 1.02 టన్నుల సామర్థ్యం గల సర్వీస్ లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నారు.

24 గంటల భద్రతా నిఘా కోసం సీసీటీవీ వ్యవస్థ, అగ్నిమాపక సదుపాయాలు, జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉంటాయి.


బీఆర్టీఎస్ రవాణా సులభతరం

దొండపాడు నుంచి ఉండవల్లి వరకు, ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని కరకట్ట రోడ్డు వరకు బీఆర్టీఎస్ కనెక్టివిటీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

ఫేజ్-3లో వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు కానుంది.

అమరావతి రాజధాని నగరానికి వేగవంతమైన రవాణా, మెరుగైన అంతర్గత కనెక్టివిటీ, భవిష్యత్ పట్టణ అభివృద్ధికి సీడ్ యాక్సెస్ రోడ్ కీలక మౌలిక వసతిగా నిలవనుంది.