చెస్‌ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్‌గా నిహారిక చల్ల

గుంటూరు స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : గుంటూరుకు చెందిన నిహారిక చల్ల అంతర్జాతీయ టోర్నమెంట్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ప్రతిష్ఠాత్మకమైన ‘మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్’ బిరుదును అధికారికంగా సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో గుంటూరుతో పాటు తెలుగు రాష్ట్రాల పేరు చెస్‌ ప్రపంచంలో మరోసారి మారుమోగుతోంది.

నిహారిక ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి, కఠిన క్రమశిక్షణ, పట్టుదల దాగున్నాయి. ఆమె తన తొలి కోచ్‌ రవీంద్ర రాజు చల్ల వద్ద పదేళ్లకు పైగా శిక్షణ పొంది చెస్‌లో బలమైన పునాదిని ఏర్పరచుకున్నారు. అనంతరం తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే క్రమంలో, సెప్టెంబర్ 2025లో హైదరాబాద్‌లోని స్కై చెస్ అకాడమీలో చేరారు. అక్కడ అజయ్ ముషిణి, సాయి కిరణ్ యర్లగడ్డల ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించారు. వారి మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహం ఆమె ఆటను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి.

ఈ మాస్టర్ బిరుదు సాధన కోసం నిహారిక విదేశీ గడ్డపై హోరాహోరీగా తలపడ్డారు. సెర్బియా వేదికగా (16–22 జూన్ 2026) జరిగిన ‘బెల్‌గ్రేడ్ జీఎం మిక్స్’, హంగేరీలో (12–17 జూలై 2026) జరిగిన ‘వెజెర్కెప్జో ఐఎమ్ రౌండ్ రాబిన్’, అలాగే స్పెయిన్‌లో (20–26 జూలై 2026) జరిగిన ‘పొంటెవేద్రా మాస్టర్స్ ఓపెన్’ అంతర్జాతీయ టోర్నమెంట్లలో అమోఘమైన ప్రతిభ కనబరిచి మూడు విమ్ నార్మ్‌లను విజయవంతంగా సాధించారు. వీటితో పాటు విమ్ బిరుదుకు అవసరమైన ఫిడే రేటింగ్ అర్హతలను కూడా పూర్తి చేసుకున్నారు. కేవలం చెస్‌లోనే కాకుండా చదువులోనూ నిహారిక రాణించారు.

ఇటీవలే ఆమె తన ఎంబీఏ విద్యను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. విద్యతో పాటు క్రీడలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె, గత ఏడాది కాలంలోనే కే -20 విభాగంలో 300కు పైగా ఎలో రేటింగ్ పాయింట్లు పెంచుకున్నారు. ప్రస్తుతం 2282 లైవ్ ఫిడే రేటింగ్‌తో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో నిరూపిస్తున్నారు.

నిహారిక సాధించిన ఈ ఘనత ఆమె కుటుంబ సభ్యులకు, కోచ్‌లకు మాత్రమే కాకుండా, భారతదేశంలోని ఎంతో మంది యువ చెస్ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (విమ్)బిరుదు సాధించిన నిహారిక చల్లను గుంటూరు ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.