కొలంబియాను వణికించిన భారీ భూకంపం.. 20 మంది మృతి
- 7.4 తీవ్రతతో ప్రకంపనలు..
ఆంధ్రప్రభ : సౌత్ అమెరికాలోని కొలంబియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రత నమోదైన ఈ భూకంపం ధాటికి పలు భవనాలు కూలిపోయాయి. కొలంబియా పసిఫిక్ తీర ప్రాంతంలో సోమవారం ఉదయం కూడా భారీ భూకంపం సంభవించింది. తొలుత ఈ భూకంపం తీవ్రత 6.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోసారి భూమి కంపించగా.. ఈ సారి కిర్టర్ స్కేల్ లై 7.4 తీవ్రత నమోదైంది.
ఇప్పటివరకు కనీసం 20 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో పాటు పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, రెండు నెలల క్రితం ప్రాణాంతక భూకంపాలను చవిచూసిన వెనిజులా సరిహద్దు ప్రాంతంతో పాటు, పొరుగున ఉన్న ఈక్వెడార్ మరియు పనామా దేశాల్లోనూ భూకంప ప్రకంపనలు సంభవించాయి.

అమెరికా భూగర్భ సర్వే సంస్థ (యూఎస్జీఎస్) ప్రకారం.. ఈ భూకంపం సోమవారం మధ్యాహ్నం 12:34 యూటీసీ సమయానికి నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:34 గంటల సమయంలో కొలంబియాలోని చోకో విభాగంలో సంభవించింది. శాన్ జోస్ డెల్ పాల్మార్ ప్రాంతానికి తూర్పున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమికి దాదాపు 107 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు ప్రారంభమైనట్లు యూఎస్జీఎస్ వెల్లడించింది.

విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిపివేత
భూకంప ప్రభావంతో కొలంబియాలో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పెరీరా, మనిజాలెస్, క్విబ్డో, ఆర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా విమానాశ్రయాల్లో నష్టం జరిగినట్లు దేశ విమానయాన సంస్థలు వెల్లడించాయి. విమానాశ్రయాల భద్రతను పరిశీలించే వరకు అక్కడ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులు, విమానాల భద్రత కోసం అధికారులు తనిఖీలు చేపట్టారు. కొలంబియా జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ విభాగం స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ నష్టం వివరాలను సేకరిస్తోంది. రాజధాని బొగోటాలో మాత్రం పెద్దగా నష్టం జరగలేదని మేయర్ కార్లోస్ గాలన్ తెలిపారు.
వెనిజులాలోనూ ప్రకంపనలు..
భూకంప ప్రభావం సరిహద్దు దాటి వెనిజులాకు కూడా చేరింది. కొలంబియా సరిహద్దు ప్రాంతమైన తచిరా రాష్ట్రంలో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మధ్య పశ్చిమ వెనిజులాలోని బార్కిసిమెటో నగరంలోనూ భూమి కంపించినట్లు సమాచారం. ఇటీవల జూన్ నెలలో వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల విషాదం నుంచి ఆ దేశం ఇంకా కోలుకోకముందే తాజా ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఆ భూకంపాల్లో 6 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
భూకంపాలకు అత్యంత ప్రభావిత ప్రాంతం కొలంబియా
దక్షిణ అమెరికాలో భూకంప ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశాల్లో కొలంబియా ఒకటి. పలు భూఫలకాలు కలిసే ప్రాంతంలో ఈ దేశం ఉండటంతో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అనేక ప్రధాన భౌగోళిక చీలికలు ఉన్న కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదవుతుంటాయి. కొలంబియా భౌగోళిక సేవల సంస్థ ప్రకారం.. ఆండీస్ పర్వత ప్రాంతం, తూర్పు కార్డిల్లెరా పర్వత పాద ప్రాంతాలు, పసిఫిక్ తీర ప్రాంతాల్లో గతంలో అనేక విధ్వంసకర భూకంపాలు సంభవించాయి.

1979లో నైరుతి కొలంబియాలోని టుమాకో ప్రాంతంలో సంభవించిన 8 తీవ్రత కలిగిన భూకంపం దేశ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఒకటిగా నమోదైంది. ప్రస్తుతం తాజా భూకంపం వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. కూలిపోయిన భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అనంతర ప్రకంపనల అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
