మైలవరంలో రేపటి నుంచి వన్‌వే ట్రాఫిక్
- ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసుల చర్యలు..
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మైలవరం, ఆంధ్రప్రభ: మైలవరం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
విజయవాడ నుంచి మైలవరం వచ్చే మార్గం
విజయవాడ నుంచి మైలవరం వైపు వచ్చే బస్సులు, కార్లు, భారీ వాహనాలు ఎల్‌బీఆర్‌సీ వై జంక్షన్, పార్క్ సెంటర్, వడ్డెర ఓబన్న విగ్రహం, పంచాయతీ కార్యాలయం మీదుగా మైలవరం బస్టాండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.
మైలవరం నుంచి విజయవాడ వైపు..
మైలవరం బస్టాండ్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు పంచాయతీ కార్యాలయం, నూజివీడు రోడ్డు, వినాయక టెంపుల్, డౌన్ సెంటర్, ఆల్ఫా సెంటర్ మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గాల్లో బస్సులు, కార్లు, భారీ వాహనాలు నిర్దేశించిన దిశలోనే ప్రయాణించాలని పోలీసులు సూచించారు.
రాంగ్ రూట్‌లో వెళ్తే చర్యలు
వన్‌వే విధానంలో నిర్దేశించిన మార్గంలోనే వాహనాలు నడపాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణించరాదని పోలీసులు హెచ్చరించారు. ప్రధాన రహదారిపై ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైన సందర్భాల్లో వీల్ క్లాంపింగ్, జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.
బస్సులు, ఆటోలు, ఇతర ప్రజా రవాణా వాహనాలు నిర్దేశించిన బస్‌స్టాప్‌ల వద్ద మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం చేయాలని సూచించారు.
షాపుల ముందు ఆక్రమణలకు తావులేదు
ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల యజమానులు తమ షాపుల ముందు వాహనాల పార్కింగ్, వస్తువుల ఏర్పాటు తదితర కార్యకలాపాలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూసుకోవాలని పోలీసులు సూచించారు. రోడ్డు, ఫుట్‌పాత్ ప్రాంతాల్లో తోపుడు బండ్లు, స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు ఇతరులను అనుమతించరాదన్నారు.
వినియోగదారులు కూడా ప్రధాన రహదారిపై వాహనాలను నిలపకుండా నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలను వినియోగించాలని కోరారు.
ప్రధాన రహదారిపై తోపుడు బండ్లు వద్దు
తోపుడు బండ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు ప్రధాన రహదారిపై వ్యాపారాలు నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని పోలీసులు స్పష్టం చేశారు. పక్క రోడ్లు లేదా పోలీసులు సూచించిన ప్రదేశాల్లో మాత్రమే వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు.
భారీ వాహనాలకు సమయ పరిమితి
పట్టణంలోని అంతర్గత రహదారుల్లో భారీ వాహనాలతో సరుకు లోడింగ్, అన్‌లోడింగ్ కార్యకలాపాలను రాత్రి 10 గంటల తర్వాత మాత్రమే నిర్వహించాలని పోలీసులు తెలిపారు. ఉదయం 6 గంటల తర్వాత సరుకు ఎగుమతి, దిగుమతుల కోసం భారీ వాహనాలను అంతర్గత రోడ్లలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
రోడ్లపై పశువులను వదలొద్దు
ఆవులు, గేదెలు తదితర పశువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు తమ ఆధీనంలోనే ఉంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు. రోడ్లపై సంచరించే పశువులను అవసరమైన సందర్భాల్లో సంబంధిత శాఖల సమన్వయంతో గోశాలలకు తరలిస్తామని తెలిపారు. పశువుల యజమానులను గుర్తించిన పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల సహకారం కోరిన పోలీసులు
ప్రజల సౌకర్యం, రహదారి భద్రత, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసమే వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వాహనదారులు, వ్యాపారులు, దుకాణాల యజమానులు, ఆటో–బస్సు డ్రైవర్లు, చిరు వ్యాపారులు, పశువుల యజమానులు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల సహకారంతోనే మైలవరం పట్టణంలో సురక్షితమైన, క్రమబద్ధమైన ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయగలమని పోలీసులు పేర్కొన్నారు.
