పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

  • ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమం..
  • మొక్క నాటిన కలెక్టర్‌ డీకే బాలాజీ

పామర్రు, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘ఏక్ పెడ్ మా కే నామ్’ (తల్లి పేరుతో ఒక మొక్క నాటండి) కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ మొక్క నాటారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం పామర్రు మండలం నిమ్మకూరు సమీపంలోని నిమ్మలూరు గ్రామంలో ఉన్న భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) ప్రాంగణంలో కలెక్టర్‌ మొక్కను నాటారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చని, పరిశుభ్రమైన జిల్లాను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను సంరక్షించాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.