ఎస్ఐఆర్ రెండో దశపై అప్రమత్తంగా ఉండాలి: మహేశ్‌కుమార్ గౌడ్
- అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలి..
- నిర్లక్ష్యంగా వ్యవహరించే బీఎల్ఏలను మార్చాలి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) రెండో దశలో పార్టీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) మరింత అప్రమత్తంగా పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు దిశానిర్దేశం చేశారు.
ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు, ఎస్ఐఆర్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. తొలి దశ ప్రక్రియ పూర్తయిందని, రెండో దశలో అనామలీస్ జాబితాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు.
అర్హత ఉన్న ఓటర్లలో ఒక్కరి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. ఓటర్ల జాబితాలో చోటుచేసుకునే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చోట స్పందించాలని సూచించారు.
బీఎల్ఏలు క్రియాశీలకంగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేసే వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సక్రమంగా పనిచేయని బీఎల్ఏల స్థానంలో కొత్తవారిని నియమించాలని నాయకులకు సూచించారు.
కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న అర్హత కలిగిన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
