తపాలాశాఖలో అంతర్జాతీయ పోస్టల్ సేవలు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న సోదరులు, సోదరీమణులు, బంధువులు, ఆత్మీయులకు రాఖీలు, శుభాకాంక్షల సందేశాలు, బహుమతులు పంపించేందుకు భారత తపాలా శాఖ ద్వారా అంతర్జాతీయ పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నాయని మచిలీపట్నం డివిజన్ తపాలా శాఖ అధికారులు తెలిపారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా విదేశాల్లో ఉన్న తమ ఆత్మీయులకు రాఖీలు, బహుమతులు పంపించేందుకు అంతర్జాతీయ స్పీడ్ పోస్ట్, అంతర్జాతీయ పార్సిల్ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ సమీపంలోని తపాలా కార్యాలయం, శాఖా తపాలా కార్యాలయాన్ని సంప్రదించి విదేశాలకు రాఖీలు, బహుమతులు, ఇతర అనుమతించబడిన వస్తువులను పంపించుకోవచ్చని తెలిపారు.

దూర దేశాల్లో ఉన్న తమ ఆత్మీయులతో రాఖీ పండుగ ఆనందాన్ని పంచుకునేందుకు తపాలా శాఖ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్పీడ్ పోస్ట్ ద్వారా వేగవంతమైన అంతర్జాతీయ మెయిల్ సేవలను పొందవచ్చని, అంతర్జాతీయ పార్సిల్ సేవ ద్వారా నిబంధనలకు లోబడి వివిధ రకాల అనుమతించబడిన వస్తువులను విదేశాలకు పంపించవచ్చని తెలిపారు.ఈ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మచిలీపట్నం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ కోరారు.