మహిళలకు ఉపాధే ప్రభుత్వ లక్ష్యం!

నర్సాపురం, ఆంధ్రప్రభ: మహిళా హస్తకళాకారులకు చేయూత నిచ్చే కార్యక్రమాలతో బాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. నరసాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం డెవలప్మెంట్ కమిషనర్ (హస్తకళలు), టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి సహకారంతో, ఎపీఐటీసీఓ లిమిటెడ్, హైదరాబాద్ ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గానికి చెందిన 60 మంది లేసు హస్తకళా మహిళలకు ఇంప్రూవ్డ్ టూల్‌కిట్లు మరియు కుట్టు మెషీన్లు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై లబ్ధిదారులకు ఇంప్రూవ్డ్ టూల్‌కిట్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.. నరసాపురం నియోజకవర్గం లేసు అల్లికలకు ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రాంతమని, ఇక్కడ వేలాది మంది మహిళలు లేసు అల్లికలను ఆధారంగా చేసుకుని తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారని తెలిపారు. నరసాపురం లేసు కళకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని మహిళా హస్తకళాకారులకు రాష్ట్రంలోనే అత్యధికంగా టూల్‌కిట్లు అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడి కృషి చేసినట్లు తెలిపారు.

మహిళా హస్తకళాకారులకు ఆధునిక పరికరాలు, కుట్టు మెషీన్లు అందించడం ద్వారా వారి పనిని మరింత సులభతరం చేయడంతో పాటు, ఉత్పత్తి నాణ్యతను పెంచి, ఆదాయాన్ని మెరుగుపరుచుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పరికరాలను మహిళలు సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు లేసు అల్లికలు చేసే మహిళా హస్తకళాకారుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు కూడా పంపిణీ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఉపాధి, స్వయం ఉపాధి మరియు ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, వారి నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సహాయ డైరెక్టర్ శ్రీమతి అపర్ణ లక్ష్మి, ఏపీఐటీసీఓ ప్రతినిధి డాక్టర్ పీడీ సుధీర్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ వలవల నాని, నిప్పులేటి తారక రామారావు, దేశినీడి గంగాధర్, రంగిశెట్టి బేబీ, పోలిశెట్టి సుబ్బలక్ష్మి, మరియు జనసేన టీడీపీ, బీజేపీ నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు .