రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

పార్టీలో కష్టపడిన వారికి పదవులు.. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలి

బిక్కనూర్ ఆంధ్రప్రభ: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. సోమవారం బిక్కనూర్‌ మండలం తిప్పాపూర్‌ గ్రామ సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సొసైటీ పర్సన్‌ ఇన్‌చార్జి భీమ్‌రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ సహకార సంఘాలు కేవలం రాజకీయ పదవులకు పరిమితం కాకుండా రైతుల సంక్షేమానికి పనిచేసే వేదికలుగా మారాలని సూచించారు. రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధిలో సొసైటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

సహకార రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యేక చరిత్ర ఉందని, రైతుల కష్టాలు తెలిసిన పార్టీ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు.

రైతులకు రుణాలు, బీమా సౌకర్యం

రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ గిట్టుబాటు ధర కల్పిస్తోందని షబ్బీర్‌ అలీ తెలిపారు. గ్రామంలోని ప్రతి రైతు సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం ఉన్న రైతులకు అవసరమైన రుణాలు అందించడంతో పాటు బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

తిప్పాపూర్‌ సొసైటీ పాలకవర్గం రైతులకు అండగా నిలిచి అవసరమైన ఎరువులు, విత్తనాలు, రుణాలను సకాలంలో అందించాలని సూచించారు. సహకార సంఘాలపై రైతులకు నమ్మకం కలిగించే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు

కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని షబ్బీర్‌ అలీ అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పార్టీలో జెండా మోసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్‌ గుర్తిస్తుందని తెలిపారు.

అంతకుముందు గ్రామంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామ్మోహన్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ లింగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు భీమ్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.