స్వాతంత్ర్య వేడుకలకు అమరావతి ముస్తాబు
- ముమ్మరంగా ఏర్పాట్లు
- పరిశీలించిన కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర రాజధాని అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. ఈ నెల 13న నిర్వహించనున్న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న శకటాల తయారీని త్వరితగతిన పూర్తి చేసి, పూర్తి స్థాయిలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, న్యాయాధికారులు, అఖిల భారత సర్వీసుల అధికారులు తదితరులు హాజరుకానున్న నేపథ్యంలో వారి రాకపోకలకు సంబంధించిన మార్గాలు, కేటాయించిన ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు.
వేడుకలకు వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రేక్షకులు కూర్చునే ప్రదేశాలు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్తో పాటు రద్దీని నియంత్రించేందుకు పక్కా ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, సీఆర్డీఏ అదనపు కమిషనర్లు ఏ. భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

