Tribunals Reform Bill 2026- Today Parlament | ట్రిబ్యునళ్లపై కేంద్రం కీలక సంస్కరణలు.. బ్యాంకింగ్ చట్టంలో మార్పులు

  • పార్ల‌మెంట్‌కు నాలుగు బిల్లులు
  • విపక్షాల నిరసనల మధ్య శాసన ప్రక్రియ
  • లోక్‌సభలో ట్రిబ్యునల్స్‌ సంస్కరణల బిల్లు–2026 ఆమోదం
  • రాజ్యసభలో బ్యాంకర్స్‌ బుక్స్‌ ఎవిడెన్స్‌ బిల్లు–2026కు గ్రీన్‌సిగ్నల్‌

Tribunals Reform Bill 2026- Today Parlament |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, జాతీయ ప్ర‌తినిధి : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రిబ్యునల్స్‌ సంస్కరణల బిల్లు–2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య ఎలాంటి విస్తృత చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. అలాగే రాజ్యసభలో బ్యాంకర్స్‌ బుక్స్‌ ఎవిడెన్స్‌ బిల్లు–2026 ఆమోదం పొందింది. సోమ‌వారం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల 16వ రోజుకు చేరుకుంది. మొత్తం నాలుగు కీల‌క‌మైన బిల్లులను పార్ల‌మెంటు ఆమోదం ల‌భించ‌గా ఇందులో రెండు ట్రిబ్యున‌ల్స్ సంస్క‌ర‌ణ‌ల బిల్లు, బ్యాంకర్స్‌ బుక్స్‌ ఎవిడెన్స్‌ బిల్లు ఆమోదం పొందాయి.

ట్రిబ్యునళ్ల వ్యవస్థలో భారీ మార్పులకు అడుగు
ట్రిబ్యున‌ళ్ల వ్య‌వ‌స్థ‌లో భారీ మార్పుల‌కు అడుగులు ప‌డ‌నున్నాయి. ట్రిబ్యునళ్ల నియామకాల్లో పారదర్శకత, స్వతంత్రత, ఏకరూపత తీసుకురావడంతోపాటు పనితీరును మెరుగుపరచడమే బిల్లు లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా నేషనల్‌ ట్రిబ్యునల్స్‌ కమిషన్ (ఎన్‌టీసీ) ఏర్పాటు ప్రతిపాదన ఉంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి , హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్‌ పనిచేసేలా ప్రతిపాదించారు.

ట్రిబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల జాప్యం, మౌలిక సదుపాయాల కొరత, కేసుల పెండెన్సీ, వేర్వేరు నిబంధనలు వంటి సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపడమే ఈ సంస్కరణల ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే కేంద్రస్థాయి కమిషన్‌ ఏర్పాటు మరో కీలక ప్రశ్నను ముందుకు తెస్తోంది. ట్రిబ్యునళ్లపై కేంద్ర ప్రభుత్వ ప్రభావం పెరుగుతుందా? అన్నదే ప్ర‌శ్న‌. ప్రభుత్వ నిర్ణయాలు, పన్నులు, నియంత్రణ సంస్థల ఉత్తర్వులు, వ్యాపార వివాదాలపై ట్రిబ్యునళ్లు తీర్పులు ఇస్తున్న నేపథ్యంలో నియామకాలు, పరిపాలన, ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉండాలన్నది అత్యంత సున్నితమైన అంశం. అందుకే ట్రిబ్యునల్‌ సంస్కరణల్లో వేగంతో పాటు స్వతంత్రత, పారదర్శకత, జవాబుదారీతనం కూడా సమానంగా కీలకంగా కానున్నాయి.

135 ఏళ్ల నాటి బ్యాంకింగ్‌ చట్టంలో మార్పులు..
రాజ్యసభలో బ్యాంకర్స్‌ బుక్స్‌ ఎవిడెన్స్‌ బిల్లు–2026 ఆమోదం పొందింది. ప్రస్తుతం బ్యాంకు రికార్డులపై ఆధారపడే న్యాయ ప్రక్రియకు 1891 నాటి చట్టం ఆధారంగా ఉంది. కానీ నేటి బ్యాంకింగ్‌ పూర్తిగా మారిపోయింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ లావాదేవీలు, ఎలక్ట్రానిక్‌ డేటాబేస్‌లు, క్లౌడ్‌ స్టోరేజ్‌ వంటి వ్యవస్థలు సాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌, వర్చువల్‌, క్లౌడ్‌ ఆధారిత బ్యాంకింగ్‌ రికార్డులకు చట్టపరమైన గుర్తింపు కల్పించే దిశగా కొత్త బిల్లు రూపొందింది. అయితే డిజిటల్‌ రికార్డులకు చట్టబద్ధతతో పాటు డేటా గోప్యత, భద్రత కూడా కీలకమే. బ్యాంకు రికార్డుల్లో వ్యక్తుల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎవరు, ఎప్పుడు, ఏ విధానంలో పొందగలరన్న దానిపై స్పష్టమైన రక్షణలు అవసరం.

ఒకే రోజు నాలుగు కీలక బిల్లులు
లోక్‌సభలో సోమ‌వారం నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. ట్రిబ్యునల్స్‌ సంస్కరణల బిల్లు–2026, మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ సవరణ బిల్లు–2026, కేరళ (పేరు మార్పు) బిల్లు–2026, నేషనల్‌ కో-ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సవరణ బిల్లు–2026 బిల్లులు.
ఒకే రోజు నాలుగు కీలక బిల్లులు ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టింది.

FCRA బిల్లు.. మరో రాజకీయ వేడి?
ఇక FCRA సవరణ బిల్లు–2026 రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరో రాజకీయ వివాదానికి కేంద్రంగా మారే అవకాశం ఉంది. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజ సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ మరింత పెరగకూడదన్నది ప్రతిపక్షాల ఆందోళన.