రాజారాం యాదవ్‌కు యూత్ కాంగ్రెస్ నేతల హెచ్చరిక
కమ్మర్పల్లి ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజారాం యాదవ్ కాంగ్రెస్ పార్టీని, నాయకులను విమర్శించే ముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని కమ్మర్పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డబోయిన నరేందర్ అన్నారు. నిరాధారమైన విమర్శలు చేస్తే తగిన రీతిలో సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.
సోమవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను విమర్శించే నైతిక హక్కు రాజారాం యాదవ్‌కు లేదన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రశాంత్‌రెడ్డి ఐదేళ్లపాటు ఆర్అండ్బీ మంత్రిగా పనిచేసినప్పటికీ, ఆయన సొంత మండలమైన ఎర్గట్ల మండల కేంద్రంలో కనీసం ఒక ప్రభుత్వ కార్యాలయ భవనాన్ని కూడా నిర్మించలేదని విమర్శించారు. నేటికీ ఎమ్మార్వో కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతున్న పరిస్థితికి గత ప్రభుత్వ పాలనే కారణమని ఆరోపించారు.
ఆర్అండ్బీ మంత్రిగా ఉన్న సమయంలో ఎర్గట్ల మండల కేంద్రంలో ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసి నిర్మించి ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని నరేందర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల మంజూరు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్‌కుమార్‌రెడ్డి కృషితో రాజారాం యాదవ్ సొంత గ్రామమైన తాళ్లరాంపూర్‌లో 38 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని నరేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై, నాయకులపై విమర్శలు చేసే ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిరాధారమైన విమర్శలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు తగిన రీతిలో స్పందిస్తాయని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బాల్కొండ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు రిత్విక్, సామాజిక మాధ్యమాల సమన్వయకర్త నల్ల సాయి కుమార్ గుప్తా, సీనియర్ నాయకులు అజ్మత్ పాషా, సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు వేములవాడ జగదీష్, క్రాంతి, అరవింద్, ముఖీమ్, ఉబేద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
