ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు నాలుగు అర్జీలు..

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్‌-1 కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. జోనల్‌ కమిషనర్‌ ఎన్‌. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మొత్తం నాలుగు అర్జీలు అందాయి.

విజయవాడ 46వ డివిజన్‌కు చెందిన రెహానా సుల్తాన్‌ తనకు విద్యుత్‌ బిల్లు అధికంగా రావడంతో ‘తల్లికి వందనం’ పథకం కింద రావాల్సిన నగదు అందలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై సంబంధిత అంశాన్ని పరిశీలించాలని కోరారు.

అల్లా బక్షి అనే వ్యక్తి జోజి నగర్‌ కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జోనల్‌ కమిషనర్‌ ఈ ఫిర్యాదును ఇంజినీరింగ్‌ విభాగానికి పంపించారు. మరో రెండు అర్జీలు టిడ్కో ఇళ్లకు సంబంధించినవి రావడంతో వాటిని టిడ్కో విభాగానికి పంపించారు.

కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ (రెవెన్యూ) యు.వి.బి. శర్మ, ఈఈ జె. శ్రీనివాస్‌, ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ అన్నపూర్ణ, డీసీబీ వై.బి. చంద్రబోస్‌, శానిటరీ సూపర్‌వైజర్లు డి. సోమరాజు, శ్రీధర్‌, మలేరియా ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, పార్క్‌ సూపర్‌వైజర్‌, టీపీఓలు తదితరులు పాల్గొన్నారు.