కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి
ఉట్నూర్‌లో జైల్ భరో కార్యక్రమం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉట్నూర్‌లో సీఐటీయూ, టీఏజీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కార్మికులతో కలిసి నాయకులు ఐబీ చౌరస్తా నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కే. సునీత, సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బోజ్జ ఆశన్న మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ‘వీబీజీ రాంజీ’ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం ఆపాలని అన్నారు. కార్మికుల హక్కులను హరించేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కులను కాలరాసేలా, రైతుల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని నాయకులు కోరారు.
నూతన విద్యుత్ సవరణ బిల్లు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చడం మినహా సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగించదని విమర్శించారు. వెంటనే ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజా సంక్షేమానికి అనుకూలమైన విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోజ్జ ఆశన్న, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, గ్రామపంచాయతీ యూనియన్ ఉట్నూర్ మండల అధ్యక్షుడు ఆత్రం సోనేరావు, కోశాధికారి అర్కా వెంకట్రావు, గ్రామపంచాయతీ యూనియన్ ఇంద్రవెల్లి మండల అధ్యక్షుడు సంతోష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుభద్ర, జిల్లా, మండల నాయకులు కుశవార్త, పార్వతి, లక్ష్మి, కృష్ణవేణి, ఆశా మండల నాయకులు రజిత, రాధ, సవిత, జీపీ యూనియన్ మండల నాయకులు చిత్రు, బాదీరావ్, రాంషో, యశ్వంత్, అంగన్వాడీ టీచర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
