ఎస్సీ హోదా సాధించే వరకు పోరాటం ఆగదు..

  • ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే ఎస్సీ హోదా బిల్లు ప్ర‌వేశ‌పెట్టాలి
  • బ్లాక్ డేగా 1950 రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వులు వెలువ‌డిన రోజు
  • ధ‌ర్నాకు సంఘీభావం ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర
  • మ‌తం మారినంత మాత్రన వివ‌క్ష మార‌దు – ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్
  • ద‌ళిత క్రిస్టియ‌న్ల‌కు ఎస్సీ హోదా క‌ల్పించ‌క‌పోవ‌డం రాజ్యాంగ విరుద్దం – మేడే రాజీవ్ సాగ‌ర్
  • ఎస్సీ హోదా ఇచ్చే వ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌దు ప్రొ. గాలి వినోద్ కుమార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ క్రిస్టియన్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. 1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, మతం మారినప్పటికీ సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాకు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్‌ వ‌ద్దిరాజు ర‌విచంద్ర సంఘీభావం తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు.

ఎస్సీ హోదా వచ్చే వరకు పోరాటం

వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు జస్టిస్‌ బాలకృష్ణన్‌ కమిషన్‌కు నివేదిక అందజేసినట్లు తెలిపారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. ఎస్సీ హోదా లేకపోవడం వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా వారి హక్కుల కోసం బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని, ఎస్సీ హోదా సాధించే వరకు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు.

మతం మారినా వివక్ష మారడం లేదు

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. దళితులు మతం మారినంత మాత్రాన వారిపై ఉన్న సామాజిక వివక్ష తొలగిపోదని అన్నారు. కుల వివక్షకు మతంతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఇతర సామాజిక వర్గాలకు మత స్వేచ్ఛతో పాటు రిజర్వేషన్‌ ప్రయోజనాలు కొనసాగుతున్నప్పుడు, మతం మారిన దళితులకు మాత్రమే రిజర్వేషన్‌ నిరాకరించడం సరికాదని అన్నారు.

1950 రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని నిబంధనలు రాజ్యాంగంలోని సమానత్వం, మత స్వేచ్ఛ స్ఫూర్తికి అనుగుణంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులను దళిత క్రైస్తవులకు కూడా సమానంగా వర్తింపజేయాలని కోరారు.

ఈ సమావేశాల్లోనే బిల్లు తేవాలి

మేడే రాజీవ్‌ సాగర్‌ మాట్లాడుతూ.. 1950 ఆగస్టు 10న జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగానే ఆ తేదీని ‘బ్లాక్‌ డే’గా పాటిస్తున్నామని తెలిపారు. మతం మారినంత మాత్రాన కులం మారదని, సామాజికంగా ఎదుర్కొనే వివక్ష కూడా అంతరించిపోదని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.

దళితులు క్రైస్తవ లేదా ఇస్లాం మతాలను స్వీకరించినప్పటికీ సామాజిక వివక్ష, అంటరానితనం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని సచార్‌ కమిటీ, రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ నివేదికలు పేర్కొన్నాయని ఆయన తెలిపారు. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

హక్కులు సాధించే వరకు ఉద్యమం

ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుల నేపథ్యంలో మతం ఆధారంగా రిజర్వేషన్‌ ప్రయోజనాలను నిరాకరించడం సరికాదని అన్నారు. ఎస్సీ హోదా సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో క్రైస్తవ సేవా సమితి అధ్యక్షుడు గడ్డం సాల్మన్‌రాజు, ఆల్‌ ఇండియా దళిత క్రిస్ట్‌ రైట్స్‌ సమితి అధ్యక్షుడు సంగటి మనోహర్‌, దళిత క్రిస్టియన్‌ ఫోరం నాయకుడు చిన్న జోసెఫ్‌, రావులపాటి మోసెస్‌, మాణిక్యాల ఏలియా, ఆల్‌ ఇండియా ముస్లిం రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకుడు డాక్టర్‌ ఇస్లాముద్దీన్‌ తదితరులతో పాటు పలువురు క్రైస్తవ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.