పోక్సో కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లాలో ఇద్దరు విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడినట్లు నమోదైన పోక్సో కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మచిలీపట్నంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఆగస్టు 6న అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా మచిలీపట్నం రుద్రవరం ప్రాంతంలోని టిడ్కో ఇళ్ల సమీపంలో విద్యార్థినులపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి శారదానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్లు మద్దాల శ్యామ్ కిరణ్ (20), కొక్కిలిగడ్డ సిద్ధు (20)లను నిందితులుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.
ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి 40 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
