డీఎస్సీ అక్రమాలపై కర్నూలులో వైసీపీ భారీ నిరసన
- సీబీఐ విచారణకు డిమాండ్..
- లోకేశ్ రాజీనామా చేయాలని నినాదాలు
- అడ్డుకునేందుకు పోలీసుల యత్నం..
- జెడ్పీ వద్ద రోడ్డుపై బైఠాయింపు
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం కర్నూలులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎస్వీ విజయ మనోహరమ్మతో పాటు పలువురు వైసీపీ నాయకులు ర్యాలీకి నాయకత్వం వహించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే నిరసనకు సిద్ధం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల నాయకులు, కార్యకర్తలను బయటకు రాకుండా నిలువరించడంతో పాటు మరికొందరిని మార్గమధ్యంలో అడ్డుకున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బుట్టా రేణుకను అడ్డుకున్న పోలీసులు

మాజీ ఎంపీ బుట్టా రేణుకను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని పోలీసులను ప్రశ్నించారు. యువత, నిరుద్యోగుల సమస్యలపై శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు.
డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలు, అవకతవకలపై నిరుద్యోగ అభ్యర్థుల తరఫున తాము పోరాడుతున్నామని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిరసనలను అడ్డుకోవడం సరికాదని విమర్శించారు.
అడ్డుకున్నా.. ఆగని అడుగులు

పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నిరసన ర్యాలీగా బయలుదేరి ఐదు రోడ్ల కూడలి వరకు చేరుకున్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో సమీకృతమై నినాదాలు చేస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం వైపు కదిలారు.
ర్యాలీకి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించినప్పటికీ వైసీపీ శ్రేణులు ముందుకు సాగాయి. మార్గమధ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
జెడ్పీ వద్ద రోడ్డుపై బైఠాయింపు
ర్యాలీ జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకున్న అనంతరం వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని నినదించారు.
ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ డీఎస్సీ అభ్యర్థుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతోందన్నారు. యువతకు మద్దతుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టామని, అయినప్పటికీ పోలీసులు అడ్డుకోవడం బాధాకరమన్నారు.
డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన లోపాల కారణంగా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆమె ఆరోపించారు. అభ్యర్థుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును హరించేలా వ్యవహరించవద్దని పోలీసులను కోరారు.
అభ్యర్థుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం
డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు వైఎస్సార్‌సీపీ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని బుట్టా రేణుక స్పష్టం చేశారు. యువత ఆశయాలు, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నప్పటికీ వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ర్యాలీ నిర్వహించడం కర్నూలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉదయం ప్రారంభమైన నిరసన ఐదు రోడ్ల కూడలి మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగి, అక్కడ రోడ్డుపై బైఠాయింపుతో ముగిసింది. దీంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
