ఆరుతడి పంటలే లాభదాయకం
గరిడేపల్లి, ఆంధ్రప్రభ: వరి పంటకు బదులుగా రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని మండల విద్యాధికారి, గ్రామ ప్రత్యేక అధికారి పానుగోతు ఛత్రు నాయక్, వ్యవసాయ విస్తరణ అధికారి రియాజ్ సూచించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయనిగూడెం గ్రామంలో సోమవారం రైతులతో ‘మాట–పంట మార్పిడికి బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం వరి సాగు చేయకుండా మినుములు, కందులు, అలసంద, జొన్నలు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
ఆరుతడి పంటల సాగుతో నేల సారం పెరగడంతో పాటు పంటల వైవిధ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో రైతులు కొండా సైదులు, పగిల్ల సైదులు, గుండు వెంకటేశ్వర్లు, కొల్లి దేవధానం, బొమ్మకంటి వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
