నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరు కానున్న సీఎం రేవంత్‌రెడ్డి

సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో ప్రత్యేక పూజలు
విజయ్‌ విహార్‌ టూరిజం గెస్ట్‌హౌస్‌ ప్రాంగణంలో యాగం..
పూర్ణాహుతిలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో నిర్వహణ

నాగార్జునసాగర్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు జలకళతో కళకళలాడాలని సంకల్పంతో నాగార్జునసాగర్‌లో సోమవారం వరుణ యాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. నాగార్జునసాగర్‌లోని విజయ్‌ విహార్‌ టూరిజం గెస్ట్‌హౌస్‌ ప్రాంగణంలో నిర్వహించే ఈ యాగానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో యాగ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

108 మంది రుత్వికులతో ప్రత్యేక యాగం

వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకుని సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో యాగాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి మేలు జరగాలని, జల వనరులు సమృద్ధిగా ఉండాలని సంకల్పంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారు.

మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 2.45 గంటలకు నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి విజయ్‌ విహార్‌ టూరిజం గెస్ట్‌హౌస్‌ ప్రాంగణంలో జరిగే వరుణ యాగానికి హాజరవుతారు.

మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. యాగం అనంతరం సాయంత్రం 4 గంటలకు నాగార్జునసాగర్‌ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లను పూర్తి చేశారు.