జటప్రోలులో యంగ్‌ ఇండియా స్కూల్‌ పనుల పరిశీలన

నాగర్‌కర్నూల్‌, ఆంధ్రప్రభ: కొల్లాపూర్‌ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల పిల్లలకు సమానంగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు.

పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. విద్యతోపాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆధునిక వసతులు, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలతో పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేసి తెలంగాణ విద్యార్థులను భవిష్యత్‌ పోటీ ప్రపంచానికి సిద్ధం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జటప్రోలు పాఠశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.