AP | డీఎస్సీపై నిరసనలు.. పెద్దిరెడ్డి అరెస్ట్‌..

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. నియామకాల్లో అవకతవకలను నిరసిస్తూ వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.

ఈ క్రమంలో తాడిపత్రిలో నిర్వహించనున్న ర్యాలీకి మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను తాడిపత్రి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో పాటు పలువురు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను ముచ్చుకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అనంతపురానికి తరలించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తమను అడ్డుకోవడంపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ముచ్చుకోట వద్దే బైఠాయించి ఆందోళనకు దిగారు. డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

తాడిపత్రి వైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎస్సీ నియామకాల అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.