అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి..

పామర్రు, ఆంధ్రప్రభ: డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పామర్రు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పామర్రు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. పామర్రులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ మీదుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది.

ర్యాలీలో విద్యార్థులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.