చేపల వలలో చిక్కుకుని మత్స్యకారుడు మృతి
హనుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ: చలివాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ వలలో చిక్కుకుని మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన పల్లెబోయిన భిక్షపతి (45) మత్స్యకారుడిగా జీవిస్తున్నాడు. రోజువారీలాగే సోమవారం తెల్లవారుజామున జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టుకు చేపల వేటకు వెళ్లాడు. వలలో ఉన్న చేపలను తీస్తుండగా ప్రమాదవశాత్తూ వలలో చిక్కుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
భిక్షపతి తెల్లవారినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చలివాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి గాలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తోటి మత్స్యకార్మికులతో కలిసి గాలించగా వలలో చిక్కుకుని మృతి చెందిన భిక్షపతి మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భిక్షపతి మృతితో మైలారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
