పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం గద్దె కూల్చివేత.. బీఆర్‌ఎస్‌ నేతల ధర్నా

వరంగల్, ఆంధ్రప్రభ: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుకు నర్సంపేటలోని మెడికల్‌ కాలేజీ ఎదురుగా బీఆర్‌ఎస్‌ నాయకులు నిర్మించిన గద్దెను మున్సిపల్‌ అధికారులు గత రాత్రి కూల్చివేశారు. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీఆర్‌ఎస్‌ నాయకులు నర్సంపేట ప్రధాన కేంద్రంలో ధర్నాకు దిగారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధర్నాలో పాల్గొని పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళులర్పిస్తూ నినాదాలు చేశారు.

ధర్నాలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్యక్రమం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమై పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, విగ్రహం ఏర్పాటుకు నిర్మించిన గద్దెను అధికారులు కూల్చివేయడంపై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.