కామన్వెల్త్‌ క్రీడల పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కామన్వెల్త్‌ క్రీడలు–2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం కలిశారు. గ్లాస్గో వేదికగా జరిగిన క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన ప్రధాని.. వారి కృషి, పట్టుదల, దేశానికి ప్రాతినిధ్యం వహించిన తీరును ప్రశంసించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

‘జో ఖేలేగా వో ఖిలేగా’’ (ఆడేవాడే ఎదుగుతాడు) అంటూ క్రీడల ప్రాధాన్యతను వివరించిన ప్రధాని.. ‘‘భారత్‌కు ఎప్పుడూ ఉత్సాహం అందిద్దాం’’ అని పేర్కొన్నారు.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌ మొత్తం 39 పతకాలు సాధించగా.. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.

బాక్సింగ్‌లో అద్భుత ప్రదర్శన..

ఈసారి భారత్‌ పతకాల వేటలో బాక్సింగ్‌ కీలక పాత్ర పోషించింది. బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించగా.. అందులో 7 స్వర్ణ పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్‌ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ బాక్సింగ్‌ ప్రదర్శనగా నిలిచింది. ముఖ్యంగా మహిళా బాక్సర్లు సత్తా చాటారు.

జూడోలోనూ భారత్‌ చరిత్ర సృష్టించింది. అస్మితా దే, హర్ష్‌ సింగ్‌ స్వర్ణ పతకాలు సాధించడంతో ఒకే కామన్వెల్త్‌ క్రీడల్లో జూడోలో రెండు స్వర్ణాలు సాధించిన తొలి సందర్భంగా నిలిచింది.

వెయిట్‌లిఫ్టింగ్‌లో మెరిసిన భారత్‌

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారులు 8 పతకాలు సాధించారు. స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను మరో స్వర్ణ పతకం సాధించి వరుసగా మూడో కామన్వెల్త్‌ క్రీడల్లో టైటిల్‌ గెలిచిన ఘనత సాధించారు.

అథ్లెటిక్స్‌లో గుల్వీర్‌ సింగ్‌ 10 వేల మీటర్ల పరుగులో రజతం, 5 వేల మీటర్ల పరుగులో కాంస్యం సాధించి ఒకే కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా నిలిచారు.

పారా అథ్లెట్లు కూడా అద్భుత ప్రదర్శన చేసి ఏడు పతకాలు సాధించారు. శర్మిలా ధంకర్‌ పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి కామన్వెల్త్‌ స్వర్ణ పతకం అందించారు.

సాంప్రదాయ పతక క్రీడల్లో కొన్ని లేకపోయినా.. ఈసారి భారత్‌ కొత్త క్రీడా విభాగాల్లో సత్తా చాటడం భవిష్యత్‌ విజయాలకు బలమైన పునాది అని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.