కౌలు రైతులకు ఆర్థిక సాయం..

  • త్వరలోనే అర్హులైన రైతులకు సహకారం: గోళ్ల రాజేష్‌

నంద్యాల నూనెపల్లె, ఆంధ్రప్రభ : నంద్యాల నియోజకవర్గంలోని కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ల రాజేష్ ముందుకు వచ్చారు. త్వరలోనే నియోజకవర్గంలోని కౌలు రైతులకు ఆర్థిక సహకారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో మోంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన కౌలు రైతులకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి అండగా నిలిచినట్లు తెలిపారు. కౌలు రైతులలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు.

ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో వడ్డీకి అప్పులు తెచ్చుకుని వ్యాపారాలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్న పలువురు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున వడ్డీలేని రుణాలు అందించినట్లు పేర్కొన్నారు. తమపై నమ్మకంతో వడ్డీలేని రుణాలు అందించిన గోళ్ల రాజేష్‌కు వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. కౌలు రైతులకు అందించనున్న ఆర్థిక సహాయానికి సంబంధించి నంద్యాల నియోజకవర్గంలోని అర్హులైన కౌలు రైతులు పట్టణంలోని గోళ్ల రాజేష్ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. నంద్యాల ప్రజలకు సేవ, సహాయ సహకారాలు అందించడంలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.