ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. ఎస్సీ రిజర్వేషన్లలో 5, 16 రోస్టర్ పాయింట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం రెండో వార్షికోత్సవం ఆదివారం సంగారెడ్డి ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షుడు బక్కన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ సమైక్యత, సోదరభావాన్ని పెంపొందించే గొప్ప పత్రంగా అభివర్ణించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సామ్యవాద, లౌకిక, సౌభ్రాతృత్వ భావనలు ప్రజాస్వామ్యానికి పునాదులని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పాలకులు అశాస్త్రీయంగా వర్గీకరించడం వల్ల ఒక వర్గానికి నష్టం జరుగుతోందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీరని అన్యాయం జరుగుతోందని, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ అంశంపై ఇప్పటికే అవసరమైన ప్రతిపాదనలను మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రిజర్వేషన్ల అమలులో న్యాయబద్ధత, సమతుల్యత పాటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
