పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదు
- ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలి
- డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్
వలిగొండ, ఆంధ్రప్రభ: జిల్లా వ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివారం వలిగొండ మండల డీవైఎఫ్‌ఐ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయకపోవడంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వైద్య రంగ పరిస్థితుల్లో ఆశించిన మార్పు రావడం లేదని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తున్న వైద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వైద్య రంగ సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు లేకపోవడంతో పేద ప్రజలు గాంధీ, ఉస్మానియా వంటి దూర ప్రాంత ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. జిల్లా వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా అధ్యక్షులు పల్లె మధుకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి కవిడే సురేష్, జిల్లా కమిటీ సభ్యులు ఆకుల రాజు, మండల అధ్యక్షులు ధ్యానబోయిన యాదగిరి, పెద్దపోయిన భీమరాజు, ఆనగంటి గణేష్, గర్దాసు మనోహర్, వీరమల్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
