వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..

  • నీట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ రిలే దీక్షకు ఏఐఎస్‌ఎఫ్‌ మద్దతు

విజయవాడ, ఆంధ్రప్రభ: వైద్య విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నీట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ధర్నాచౌక్‌లో రిలే దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి నాయకత్వం మద్దతు తెలిపింది.

ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వరరాజు, ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్‌ మాట్లాడుతూ.. జాతీయ వైద్య కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టి భారీగా ఫీజులు వసూలు చేసే పరిస్థితి తీసుకురావడం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయవద్దన్నారు.

ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వైద్య విద్యార్థులపై ఉన్న 36 గంటల పని భారాన్ని వెంటనే తగ్గించాలని కోరారు. వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు.

నీట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న విద్యార్థులకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా స్టైపెండ్‌ పెంచాలని కోరారు. వైద్య కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని అన్నారు.

ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మోజాడ యుగంధర్‌ మాట్లాడుతూ.. వైద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఈ అంశాలపై తక్షణమే స్పందించాలని కోరారు. రిలే దీక్షలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.