చేసిన మేలు చెప్పండి.. వైసీపీ తప్పుడు ప్రచారం తిప్పికొట్టండి
- పార్టీ కార్యక్రమాలు నిర్లక్ష్యం చేస్తే సహించం
- సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు చేసిన అభివృద్ధి, సంక్షేమం మేలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలకు చెప్పండి, అలాగే వైసిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టండి అంటూ పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించబోవనని పార్టీ కార్యక్రమాలే తొలి ప్రధాన్యంగా భావించాలని శ్రేణులకు సూచించారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చాలా పంచాయతీలు వెనకబడి ఉండటంపై మంత్రి సీరియస్ అయ్యారు.
ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్నామని, ప్రథమ స్థానానికి తీసుకురావాలని కోరారు. ఎన్టీఆర్ భవన్ ఆవరణలో నియోజకవర్గం గంలో 44 మంది లబ్ధిదారులకు 22,83,053 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం అందజేశారు. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తోందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 640 కోట్లు నిధులతో ఇంటింటికి తాగునీరు అందిస్తామని, అలాగే ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నేరడి బ్యారేజీతో వంశధార జలాలకు కొత్త భరోసా కల్పించినట్లు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వంశధార-నేరడి బ్యారేజీ సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు.
19 టీఎంసీల నీటిని నిల్వ చేసి వంశధారలో పెడితే ఎల్ నినో పరిస్థితులు వచ్చిన జిల్లా రైతులు రెండు పంటలు పండించుకోవడానికి తగినంత సాగునీరు అందుతుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని ‘సూపర్ సిక్స్’ సూపర్ హిట్ అయింది మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొత్త బీమా పథకం ప్రవేశపెట్టాయని, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు 24 గంటల వ్యవధిలోనే ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ప్రతి కార్యకర్త గ్రామాల్లో ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట సమయం కేటాయించి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మై టీడీపీ యాప్‌లో నమోదు చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. టెక్కలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, తెలుగు దేశం పార్టీ నాయకులు బోయిన గోవిందరాజులు, రమేష్, సత్య శ్రీనివాస్, వి విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, ఎన్. శ్రీనివాస్, జి. లక్ష్మణరావు, బాడాన వెంకటరమణమ్మ, కర్రి అప్పారావు, సుంకరి గణపతి రావు, తదితరులు పాల్గొన్నారు.
