గాలం పడితే ఆ సరదానే వేరప్ప..!
టేకుమట్ల, ఆంధ్రప్రభ: వర్షాలతో వాగులు, వంకల్లో నీటి ప్రవాహం పెరగడంతో చేపల సందడి మొదలైంది. దీంతో స్థానికులు సరదాగా చేపల వేటకు ఆసక్తి చూపుతున్నారు. వలలతో చేపలు పట్టడం సాధారణమే అయినా.. కొందరు మాత్రం గాలం వేసి చేపలు పట్టడంలో ప్రత్యేక ఆనందాన్ని పొందుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో టేకుమట్ల మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లోని మానేరు, చలివాగుల్లో నీటి మట్టాలు పెరిగాయి. జలాశయాలు, వాగులు, వంకల్లో చేపల కదలికలు పెరగడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో గాలాలు పట్టుకుని వెళ్లే వారి సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా మానేరు బొడ్డు ప్రాంతాల్లో గాలాలు వేస్తూ చేపల కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
గోధుమ పిండితో ఎర తయారీ
చేపలు పట్టేందుకు సన్నని కర్రకు దారం కట్టి చివరలో సూది ఆకారంలో ఉండే గాలాన్ని అమర్చుతారు. చేపలు గాలానికి చిక్కాలంటే ఎర తప్పనిసరి. గతంలో ఎక్కువగా వానపాములను ఎరగా ఉపయోగించేవారు. ప్రస్తుతం గోధుమ పిండి, తౌడు, కోడిగుడ్డు, మైదాపిండి, బిస్కెట్ పొడి వంటి వాటిని కలిపి ఉండలుగా తయారు చేసి గాలానికి ఎరగా ఉపయోగిస్తున్నారు.
కొన్నిసార్లు పలుమార్లు ఎర వేసిన తర్వాతే చేపలు చిక్కుతుంటాయి. అయితే చేప గాలానికి చిక్కిన క్షణంలో కలిగే ఆనందం వేటగాళ్లకు ప్రత్యేక అనుభూతిని ఇస్తోంది.
సరదా కోసమే గాలం వేస్తున్నా
మేడిపల్లి మొరళి మాట్లాడుతూ.. “మానేరు పరిసర ప్రాంతాల్లో నీరు రావడంతో తరచూ చేపల కోసం గాలం వేస్తున్నాను. గాలం వేయడం నాకు అలవాటుగా మారింది. నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి గోధుమ పిండి, కోడిగుడ్డు, బిస్కెట్, తౌడు కలిపి ఎర తయారు చేస్తాను. చిన్నా, పెద్దా చేపలు గాలానికి చిక్కినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. పట్టుకున్న చేపలను ఇంటికి తీసుకెళ్తాను” అని తెలిపారు.
ఏకాగ్రత పెంచే అలవాటు
నేరెళ్ల రాజయ్య మాట్లాడుతూ.. “గాలం వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. గాలం వేసినప్పుడు చూపంతా దానిపైనే ఉంటుంది. ఒక్కసారికే చేపలు చిక్కవు. పలుమార్లు ఎర వేస్తే ఒక్కటి చిక్కుతుంది. అది చిక్కినప్పుడు కలిగే ఆనందమే వేరు” అని అన్నారు.
ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడుపుతూ చేపల వేటను ఆస్వాదిస్తున్న స్థానికులకు గాలం వేయడం ఓ సరదాతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తోంది.
