అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ నిఘా

ఆదోని, ఆంధ్రప్రభ: అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆదోని రూరల్‌ పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. ఇందులో భాగంగా డ్రోన్‌ కెమెరాల సాయంతో కొండ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ప్రజలకు దూరంగా ఉన్న ప్రాంతాలను కొందరు అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో నిఘాను ముమ్మరం చేశారు. ముఖ్యంగా నాటుసారా తయారీ, నిల్వ, విక్రయం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.

డ్రోన్‌ కెమెరాల ద్వారా అనుమానాస్పద ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట ప్రత్యక్షంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాటుసారా వంటి మత్తు పదార్థాల తయారీ, విక్రయం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను అరికట్టేందుకు నిఘా, తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.