ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటమే కమ్యూనిస్టుల ధ్యేయం
వరంగల్, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటమే కమ్యూనిస్టుల ధ్యేయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపడుతున్న పాదయాత్రలో భాగంగా ఆదివారం వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ నుంచి సీపీఐ పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఎల్బీనగర్, గొర్రెకుంట, ధర్మారం మీదుగా గీసుకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై భారం పడుతోందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన ఈ యాత్రలు జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల మీదుగా సాగుతూ ప్రజలతో మమేకమవుతాయని పేర్కొన్నారు. సీపీఐ పోరుయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బాష్‌మియా, రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి, పంజాల రమేష్, సయ్యద్ వలీఉల్లా ఖాద్రి, సీనియర్ నాయకులు టి. వెంకట్రాములు, జిల్లా సహాయ కార్యదర్శులు దండు లక్ష్మణ్, పనాస ప్రసాద్, జిల్లా నాయకులు గన్నారపు రమేష్, అక్కపెల్లి రమేష్, కందిక చెన్నకేశవులు, సంగి ఎలేందర్, గుండె బద్రి, వీరగోని శంకరయ్య, తాళ్లపల్లి రహేలా, ఓర్సు రాజు, ఎండీ అక్బర్, పి. రమేష్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
