చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో కేటీఆర్ ప్రత్యేక పూజలు

  • సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బోనాల పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చార్మినార్‌ వద్ద కొలువైన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.

సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వ్యాపారాలు సజావుగా సాగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారని, తెలంగాణ ప్రజలందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు లభించాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.